How Many Goats to Start a Goat Farm / Growing goats /మేకల పెంపకం

 

మేకల పెంపకం





వ్యవసాయానికి అనువుగా లేని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు మేకల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. మేకలు కలుపు మొక్కలను, ముళ్ళ పొదలను, బీడు భూములను, పంటకోసిన మొదళ్ళను సమర్ధవంతంగా ఉపయోగించుకొని విలువైన మాంసం, చర్మం, మరియు పంటపొలాలకు, అడవులకు అధిక సత్తువగల ఎరువు నిస్తాయి. వీటిని పెద్ద పశువులతోగాని గొర్రెలతోగాని పోలిస్తే తక్కువ ఖర్చుతో, మామూలు పాకల్లో లేదా ఆరు బయళ్ళలో పెంచవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరితగతిన వృద్ధిచెంది ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలు రావడంవల్ల, అధిక రోగ నిరోధక శక్తి కలిగి మరియు ఆరోగ్య సమస్యలు తక్కువ ఉండటంవల్ల, బాగా ఆదాయం వస్తుంది. మన ప్రాంతానికి అనువైన జాతులను ఎన్నుకోవడం వల్ల లాభసాటిగా మేకల పెంపకం చేపట్టవచ్చు. మేకలలో ముఖ్యజాతులు

జమునాపరి :   ఇది మేక జాతుల్లో ఎత్తైనది. ఈ జాతిమేకలు ఉత్తరప్రదేశ్లోని మధుర, ఇటావా ప్రాంతాల్లో దొరుకుతాయి. ఈ జాతి మేకలు తెల్లగా, శరీరంపైన గోధుమరంగులో చుక్కలు కలిగి ఉంటాయి. గొంతు, ముఖం వద్ద ఎక్కువగా ఈ మచ్చలుంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉండి, ఒత్తుగా వెంట్రుకలుంటాయి. చెవులు పొడవుగా ఉండి వేలాడుతూ ఉంటాయి. మగ, ఆడ రెండింటిలోనూ కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలకు చిన్నగా సన్ననితోక ఉంటుంది. ఈ జాతి మేకలు ఒకటి నుంచి రెండు లీటర్ల పాలిస్తాయి.

బార్బారి : ఈ జాతి మేకలు ఉత్తరప్రదేశ్లోని మధుర, ఇటావా, అలీగర్ ప్రాంతాల్లో లభ్యమవుతాయి. ఈ జాతి ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలను ఈనుతుంది. ఇవి చిన్నగా, తెల్లగా ఉండి, చర్మంపై లేత గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. చెవులు చిన్నగా ఉండి నిక్కబొడ్చుకొని ఉంటాయి. మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలు రోజుకు 700 మి.లీ. నుంచి లీటరు వరకు పాలిస్తాయి.

బీటల్ :  ఈ జాతి మేకలు పంజాబ్ మరియు హర్యానాలో లభ్యమవుతాయి. ఇవి పెద్దగా ఉండి, (జమునాపరి కంటే చిన్నవి), నల్ల రంగులో ఉంటాయి. చెవులు వేలాడుతుంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. తోక సన్నగా మరియు చిన్నగా ఉంటుంది. మేకలు, మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఇవి రెండు లీటర్ల దాకా పాలిస్తాయి. ఉస్మానాబాద్ : ఈ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉదిగిర్, లాతుర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో లభ్యమవుతాయి. శరీరాకారం పెద్దదిగా ఉండి, నల్లరంగులో ఉంటుంది. శరీరంపై తెల్ల రంగులో మచ్చలుంటాయి. అరలీటరు నుండి లీటరున్నర వరకు పాలనిస్తాయి.

బ్లాక్ బెంగాల్ :  ఇవి చిన్నగా, ఎక్కువగా నల్లరంగులో ఉంటాయి. అక్కడక్కడ గోధుమరంగులో మరియు తెలుపు రంగులో లభ్యమవుతాయి. వీటి చెవులు మొనదేలి వుంటాయి. ఇవి త్వరగాకడతాయి. ఎక్కువ పిల్లల్ని పెడతాయి. మేకల్లో, మేకపోతుల్లో కొమ్ములుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైనది. మాంసానికి ప్రసిద్ధి చెందినది. మేకల గృహవసతి : ఎత్తైన, నీరు నిల్వని, మురుగునీరు బయటికి పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించాలి. ఎల్లప్పుడూ చల్లగా, పరిశుభ్రంగా తగినంత గాలి ప్రసరించాలి. స్థానికంగా దొరుకు కలపగాని లేదా రాతి స్తంభాలపైన గాని కొట్టాలు వేయవచ్చు. పైకప్పును ఎండిన కంచగడ్డితోగాని, తుంగ లేదా తాటి ఆకులతోగాని వర్షపు నీరు కారకుండా కప్పవచ్చు. నీరు, దాణా అన్ని మేకలకు అందుబాటులో ఉండే విధంగా దాణా మరియు నీటి తొట్టెలను నిర్మించాలి. ఎండ, వాన, చలి వంటి పరిస్థితులనుండి రక్షణ కలిగించేలా మేకల కొట్టాలను నిర్మించాలి. షెడ్ నాలుగు వైపుల, వెలుపల చల్లదనం, మేతనిచ్చే చెట్లు పెంచాలి. షెడ్ లోపల నేలపై మొరము లేదా ఎర్రమట్టిని వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాకలో సరిపోయినంత స్థలం ఉండాలి. ఒక్కొక్క ఆడ మేకకు ఒక

చ.మీటరు, మేకపోతుకు 2 చ.మీ., మేక పిల్లకు 0.5 చ.మీ. స్థలం ఉండేటట్లు చూడాలి. శీతాకాలంలో దడి చుట్టూ గోనెసంచులు కప్పిన ఎడల రాత్రివేళల్లో చలిగాలి లోపలికి రాకుండా ఉంటుంది.

మేకల మేపు : మేకలు అభివృద్ధి కావాలంటే వాటికి కావలసిన మేపును సమకూర్చాలి. మేకలను కనీసం రోజుకు 8 నుండి 10 గంటల వరకు భీడు భూముల్లో, పంటకోసిన పొలాల్లో, అడవుల్లో మేపాలి. వీటితోపాటు పాక చుట్టు ప్రక్కల ఉన్న స్థలంలో పచ్చిమేతలు పెంచాలి. మేకలు పచ్చిగడ్డితోపాటు ఎక్కువ చెట్ల ఆకులను, పండ్లతొక్కలను, కూరగాయల ఆకులను ఇష్టపడతాయి. కావున పశుగ్రాసాన్నిచ్చే చెట్లైనటువంటి సుబాబుల్, అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప మొదలగు వాటి ఆకులను సమృద్ధిగా ఉపయోగించవచ్చు. వీటితోపాటు కాయజాతి ఏదవార్షికాలైన జొన్న, సజ్జ, మొక్కుకొన్న మరియు పప్పుజాతి పశుగ్రాసాలైన అలనంద, హెడ్జిలూసర్న్, స్టైలో మొదలగునవి పెంచాలి. క్యాబేజి, కాలీఫ్లవర్, క్యారట్ కూరగాయల ఆకులను కూడా తింటాయి.

పచ్చిమేత ఇచ్చేటప్పుడు షుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేతలు, 3 కిలోల ఇతర పశుగ్రాసాలివ్వాలి.

విత్తనపు మేకపోతుల పోషణ : విత్తనపు మేకపోతులకు వేరే వసతి కల్పించి వాటికి కావలసిన ఆహార పోషక పదార్ధాలను సమకూర్చాలి. ప్రతి మేకపోతుకు ఒక్కొక్క దానికి 300 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500గ్రా. (ఒక్కింటికి)ల చొప్పున ఇవ్వాలి. శుభ్రమైన త్రాగేనీటిని అందుబాటులో ఉంచాలి.

మేకపోతులకు, పెద్దమేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 భాగాల మొక్క జొన్నలు, 5 భాగాల వేరుశనగ పిండి, 20 భాగాల గోధుమ పొట్టు, 20 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 14 భాగాల జొన్నలు మరియు సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండాలి.

స్థానికంగా దొరికే ముడి సరుకులనుపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారుచేసుకొనవచ్చు.

మేకల్లో సంపర్కం : మేకలు దాటించే వయసు వచ్చేసరికి కనీసం 25 కిలోలుండాలి. ఆడ మేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే మొదటి ఎదకొస్తాయి. మేకలు సంవత్సరం పొడుగునా ఎదలోకొస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, మరల సెప్టెంబరు, నవంబరులో వస్తాయి. మేకలు ఎదలో 1-3 రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదలోకొస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడు వేసక్టమీ చేసిన మేకపోతును వదలాలి. ఇది ఎదలో వున్న మేకలను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. ఎదలో వున్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు షుమారు 35 ఆడ మేకలకు సరిపోతుంది.

చూడి మేకల పెంపకం : మేకలు, చూడి కట్టిన మూడు నెలల తర్వాత కడుపులోని పిల్లల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడి మేకలకు మంచి దాణా ఇవ్వాలి. 200 నుండి 250 గ్రాముల వరకు మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటంవలన ఎక్కువ బరువుతో పిల్లలు పుడతాయి. మేక ఆరోగ్యం బాగుండి ఎక్కువ పాలిస్తుంది. మరియు పిల్లలు బాగా పెరుగుతాయి. పచ్చిమేత, చెట్ల ఆకులతో బాగా మేపాలి. శుభ్రమైన నీటిని త్రాగించాలి. కొద్దిపాటి వ్యాయామం అవసరం. అందుకుగాను షెడ్ చుట్టూ ఉన్న ఖాళీస్థలంలో

తిరగటానికి వదలాలి.

మేకపిల్లల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు : మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి. మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను వుంచే ప్రదేశంలో 10% ఫినాల్ను

మేకల పెంపకంలో ఆదాయం పొందటానికి వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. మేకలను పరిశుభ్రమైన పరిసరాలు, మేత, నీరు మరియు ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేసినట్లయితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు.

మేకలు మేత మేస్తున్నప్పుడు వాటి ఆహారంతోపాటు కొన్ని అంతర పరాన్న జీవులు (ఏలిక పాములు, బద్దెపురుగులు, జలగలు) వాటి శరీరంలో చేరి, పోషకాల్ని పీల్చివేసి, అనారోగ్యానికి గురిచేస్తాయి. కావున సంవత్సరానికి కనీసం మూడుసార్లు నట్టల నిర్మూలన మందులను త్రాగించాలి. పేలు, పిడుదులు, గోమార్లు మొదలగు బాహ్య పరాన్నజీవులు రక్తాన్ని పీలుస్తూ బలహీన పరచటమే కాక కొన్ని అంటువ్యాధులను కలుగజేస్తాయి. వాటిని అరికట్టాలంటే వాటి శరీరంపై సుమిసిడిన్, మలాథియాన్, ఫెన్ వలరేట్ మొదలగు మందులను పిచికారి లేదా డిప్పింగ్ చేయాలి. అంటువ్యాధుల్లో పారుడు వ్యాధి (పి.పి.ర్), చిటుకు రోగం, గొంతువాపు, మశూచి, గాలికుంటు ముఖ్యమైనవి. ఈ వ్యాధులన్నిటికి వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయించి రక్షించవచ్చు.


Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)